Tuesday, 12 January 2016

//గ్రీష్మ కోయిల//



నిశ్శబ్దాన్ని నింపిన పుష్పపరిమళంలా నువ్వు..
ఏకాంతాన్ని అయస్కాంతం చేసి ఆకర్షిస్తావు..
తలపుల తరువులరెమ్మలు ఎదలో ఊయలూగుతుంటే..
విప్పారిత నేత్రాలను నిమీలితం చేస్తూ
మరపురాని మధురిమల రుచిని తిరగతోడి..
అధరాన మందారపువ్వులు పూయిస్తావు..
సల్లాపాల సగపాలను గుర్తుచేసి
మురిపాల పరవశానికి పట్టిస్తావు..
పెదవుల తేనెవాకలో రసాలను కూడి..
కవనసరస్సుకు పునాదులు తీయబోతుంటే..
నా ఉచ్ఛ్వాసనిశ్వాసలను ఉధృతం చేస్తావు..
మరచిపోయిన సంధ్యారాగాన్ని వెలికితీసి
తోడిరాగానికి తోడుచేసి మౌనన్ని కరిగిస్తావు..
నీతో కలిసి ఊహలు విహరించని వనమేదో కనుగొనదామంటే
హఠాత్తుగా మరుత్తరంగ సంగీతంలో విలీనమైపోతావు..
గ్రీష్మంలో దారితప్పిన కోయిలనని భావించినట్లు..!!


//ముభావన//




గుప్పిట దాగని గుబులేదో..
గుండెలో జొరబడి సొదపెట్టగా
సానబెట్టలేని భావాలు కొన్ని..గరుకుగా గుండెను కోసేస్తుంటే
తెలియని నొప్పి శరీరాన్ని నలిపేస్తుంది..
ఒకప్పుడు అనుభవమనుకున్న ఇంద్రజాలమేదో
విషాదపు నిషాదమై గతాన్ని గుర్తుచేసి గుచ్చుతుంటే..
కన్నులముందు చీకటితెరేదో పరుచుకుంటూ..
ఉన్న కాస్త వెలుతురునీ దూరం చేసింది..
నా జీవితం నా ఆధీనంలోనిదేనని తెలిసినా
నీ మనసు నియంత్రిస్తున్న భావనలు..
నలుగురిలో నన్ను ఒంటరిని చేసి నిలబెడుతూ..
నా అనుకొనే అస్తిత్వపు ఆనవాళ్ళనూ తుడిచిచిపెట్టేస్తూ..!!
 


//మౌన రహస్యం//



ఎన్నిసార్లు మదిలోంచీ చెరుపుతావో నన్ను..
రానంటున్నా పదేపదే నీ ఊహాల్లోకి ఆహ్వానిస్తావు..
మౌనంగా నేనున్నా..
మాటలమల్లెలతో వలవేసినట్లు బంధిస్తావు
నీ ఊసులతో ఉక్కిరిబిక్కిరైన నన్ను..
తిరిగి ఊపిరితో ఉసురుపోసి కౌగిలిస్తావు..
నిద్దురలోనే అటూఇటూ కదులుతూ నీలోకి ఒదిగించుకుంటావు..
ఇంతా చేసిన నువ్వు..
అనుభూతికి అందలేదని నన్ను నిందిస్తావెందుకో..
నీ హృదయలోతుల్లోకి అడుగులేసేందుకు నే తడబడుతుంటే..
స్పర్శదీక్ష ఇచ్చి మరీ చేరదీస్తావు..
మత్తేభమంటి మైకపు మంత్రాలు కూర్చి..
మనసును రాగాలకెరటాలలో ముంచుతావు..
ప్రేమస్వరాలు వినిపించేలా నాలో ప్రతితంత్రినీ మీటుతావు..
నులివెచ్చని హృదయార్తిని మెత్తగా తాగుతావు..

అయినా స్వాతిశయమెందుకోయ్ నీకు..
నేనంటే ఇష్టమనే భావం నాతో చెప్పకుండానే నీకు ఆనందమిస్తే..
మదిలోనే దాచుకోక..
రహస్యమైనదేమో రట్టయినట్టు..
మౌనం మాట తప్పిందని విస్తుపోతావెందుకు..
చూపులతోనే చతుర్లాడే నీ చిలిపితనం నాకు తెలియనట్టు..!!


//దిద్దుబాటు//




తప్పని నిబంధనలు కొన్ని..
కట్టుదిట్టం చేస్తే కనుసన్నల నుండీ జారిపోతారని తెలిసినా
భద్రతావలయమన్నదే గీయకుంటే..
మనసును కలుషితం చేసే ఉత్ప్రేరకాలెన్నో నేడు..
ఎటు తిరిగినా మహేంద్రజాలంతో మాయజేసే మోసాలు..
ఏమరుపటులోనే సర్పాలై కాటేసే విషవలయాలు
దిగమింగుకోలేని ఆత్మన్యూనతను పెంచే కట్టుబాట్లు కొన్ని
ఆకతాయితనాన్ని ఆసరా చేసుకొని వయసును కసిదీరా నలిపేస్తే..
బలహీనమైన అంతరాత్మ పోరాటంలో..
రకరకాల ఒత్తిళ్ళకు గురయ్యే పిల్లలెందరో..
నిన్నమొన్నటి దాకా పొత్తిళ్ళలోని పాపాయిలే అయినా..
తప్పులు దిద్దని నిర్లక్ష్యం మన పొరలు కమ్మితే..
రేపటి సమాజానికి సమాధానమివ్వలేని సందిగ్ధాలేగా మిగిలేది..!!
 
 

//విస్మృతి//



చెదిరిపోని స్వప్నమొకటి..
పదేపదే నిద్దురను భగ్నం చేస్తూ
మానిపోయిన గాయాన్ని పదేపదే రేపుతుంటే..
అదే మంటను తిరగతోడినట్టు..
ఒకపక్క శిశిరం రాలిపోతూనే..వసంతానికి తొందరపడమంటుంటే..
పరుగెత్తే కాలానికి కాలడ్డుపెట్టి ఆగమన్నట్లు..
ఋతువులను శాసించాలనే ప్రయత్నమేదో..
కన్నీరు ఇంకిపోయిన చూపుల్లో గ్రీష్మాన్ని వెక్కిరిస్తూ
ఘనీభవించిన మదిలోని తడి వర్షమై కురుస్తుందో లేదోనని పరీక్షిస్తూ
రంగురంగుల స్మృతుల గవ్వలు గలగలమంటూ
గుండెసవ్వడిని పెంచేస్తుంటే
ఊరించే ఉషస్సులూ..కదిలించే సంధ్యలూ కరిగిపోగా
రాతిరవుతుంటే భయమేస్తోంది..
మరో దుస్స్వప్న వీక్షణానికి సిద్దం కాలేక
రెక్కలు విప్పేందుకు సిద్ధమయ్యే ఊహలకు ఉరేయలేక..!!
 
 

//ఒకటే జ్ఞాపకం//



గుభాళించినప్పుడే అనుకున్నా..
నువ్వో పరిమళమై అలుకున్నావని
తియ్యందనం తోచినప్పుడే తడుముకున్నా..
నన్ను తలచుకునుంటావని..
ఓదార్చుకోలేకపొయా..
నువ్వు దూరమైన క్షణాలు గుర్తొచ్చి
పలకరించే ధైర్యమూ చేయలేకపోయా
విధిని ఓడించి నిన్ను గెలువలేనని..
అందుకే కాలాన్ని కనికరించమని వేడుకున్నా..
అక్షరాల అనునయంతోనైనా నా గాయాలకు మందు పూస్తుందని..
ప్రతిసారీ నిన్ను రాసిన చేతిని ముద్దాడుకుంటున్నా
భావంగానైనా నిన్ను ఒదిగించి అందంగా పొదిగిందని
అందేంత దూరంలోనే నువ్వున్నావనే సందేశమిచ్చిందని
ఎప్పటికైనా మనిద్దరం జతయ్యే ఉంటామని..
చెలియలకట్టను దాటి చెలిమి చేయి అందుకొనే రోజొస్తుందని..!!
 
 

//ఒంటరి పయనం//




చదువుతూనే ఉన్నా
నువ్వు రాసింది
అర్ధమైనా మళ్ళీ మళ్ళీ చదువుతున్నా
నువ్వంతా బాగా విశదీకరిస్తుంటే..
నన్ను నేను తరచి చూసుకోవచ్చని..
మనసు చంచలమైనా
చూపును సరిదిద్దుకోవచ్చని..
బతుకుపోరాటంలో..
గెలిచే ఆశలేకున్నా..
ఊహలను ఒక్కరితోనైనా పంచుకోవాలని..
నవ్వు నిజాన్ని దాచేస్తున్నా
పెదవుల అందాన్నైనా చూపించాలని..
తడియారని నేత్రాల నీరు నిండినా
మనసులోకే ఇంకించుకుంటూ
దుఃఖాన్నెప్పుడూ పెదవి పొలిమేరలు దాటనివ్వక
మనసుకీ మనసుకీ వంతెనేస్తూ..
కలహమనే మాటకి తావివ్వకుండా
అస్తిత్వమనే ఆరాటానికి ఎదురెళ్ళకుండా..
ఎప్పటికప్పుడు చైతన్యాన్ని నింపుకుంటూ
నాలో నేనే అనేకమవుతున్నా..
కృష్ణవర్ణం..గౌరవర్ణం కాని ధవళవర్ణ తేజస్సు నింపుకొని
జీవనకాసారంలో ప్రయాణిస్తున్నా..!!
 
 

//మోహం//



అక్షరాలను లాలించాలని నేను కూర్చుంటే..
తలపువై రాయమంటూ ఎదురవుతావు..
దాచుకున్న మాటలన్నీ రాసేలోపుగా..
పెదాలపై పాటగా వచ్చి ఆలాపనవుతావు..
మదిలోని మోహానికి మరువాన్ని జల్లి..
మల్లెల్లో కూర్చి దారంతో కట్టేలోపే..
పరిమళాల ప్రకంపనై చుట్టుముడతావు..
కవిత్వాన్ని కలంలో కూరేలోపునే..
అల్లిబిల్లి సల్లాపాలను మొదలెడతావు..
విరిసుగంధాల క్షణాలను రాసేలోపే..
నన్నల్లరిపెట్టి ఆలింగనం చేసి అల్లుకుపోతావు..
మోహనమయిందంటే మౌనం..
అవదూ మరీ...
శృతి చేసి మరీ మనసును పాడిస్తుంటే..
పల్చని వెన్నెలేనని నేను పట్టించుకోకున్నా..
నిండు చందమామనే చూపిస్తావుగా ప్రేమలో..!!


//కాలప్రవాహం//



మదివీడిన మమతలెన్నో..
మరపురాని వేదనల్లో..

కలకలమను కబురులెన్నో..
దాచుకున్న రహస్యంలో..

పేర్చున్న పదాలెన్నో..
మదిమీటి వెలసిన వెన్నెలల్లో..

గుర్తుకొస్తున్న గమకాలెన్నో..
మరపురాని మధురస్మృతుల్లో..

గుర్తించని మనసులెన్నో..
గుర్తుచేసే నిశ్శబ్దఘోషలో..

కాలం కరిగిపోతూనే ఉంది..
ఆస్వాదించేలోగానే ఆవిరైపోతూ..
ఏమీ మారలేదు..ఎన్నటికీ మారదేమో..
ఇలా తపిస్తూ..గెలవాలని ఓడిపోతూ..తిరిగి ఎదురుచూస్తూ..ఆశపడుతూ..!!


//అంతర్ముఖం//

ఇష్టమైన వెతుకులాటైనా ఎంత కష్టమో కదూ
మారుతున్న ప్రపంచంలో మార్పు తెచ్చిన భావాలు..
అనేకం పుట్టుకొస్తున్నా మారనిదేదన్నా ఉంటే..
అది నీ మీద ప్రేమే..
మానసికంగా అలసిపోయినప్పుడు గుర్తుకొచ్చే హాయినే ప్రేమంటారంట
కానీ...
నా మనోవిహంగమేమో..
ఎప్పుడూ ఎగిరొచ్చి నిన్నే చేరాలనే తాపత్రయంలో కొట్టుకుంటుంది
అలవికాని పనులతో అలసిపోయిన ఉదయమూ లేదు..
శరీరం విశ్రాంతి కోరినా సహకరించని మనసుకి రాత్రీ తెలీదు
నువ్వన్నట్లు..
నా ఏకాంత మౌనంలోనూ..స్మృతుల పవనాలలోనూ..
అనుభూతుల్లో జీర్ణమైన నిన్నే నెమరేసుకుంటూ
కమలాలైన కన్నుల్లోంచీ జారిపడేందుకు
సిద్ధపడ్డ కన్నీటిచుక్కని అదిమిపెడుతూ
శిశిరం వాటేసినా రాలిపోని తృణపత్రం వలే..
సజీవంకాని అజ్ఞాతంలో ఆశా రెపరెపలతో బతుకుతున్నా..!!

//అంత్యాక్షరి//


రెక్కలు మొలిచిన ఆనందమేదో నాలో..
నీ తలపులతో అంత్యాక్షరులు ఆడుతుంటే..
జ్ఞాపకాలవీధుల్లో తారాడలేక మదిలో..
పక్షులను దాటి పైకెగిరి..
నింగిని చుంబించే విన్యాసాలేవో..
తనువును తేలిక చేసేసి ఉల్లాసమవుతుంటే..
అనుగ్రహవీచికలుగా తోస్తున్న చిగురాకు సవ్వళ్ళను ఆలకిస్తూ
మంత్రజపాన్ని మించిన నీ వలపు ఆకర్షణకు లోనవుతూ..
సంగీతమై తేలిపోతున్నా..సం యోగమై నీ దరి చేరాలని..
అధరాలపై చిరునవ్వులు సిరివెన్నెలై పురివిప్పుకుంటుంటే
చినుకులైన మధువునందించి
పున్నాగ పొదరింట నిన్ను కప్పుకోవాలని..
కలల నదులూ..ఊహల పొదలూ దాటి
పరవశాల విపంచివైన నిన్ను మీటి వసంతాన్ని అనుభవించాలని..
అతిశయించే అందాన్ని అదిమిపెట్టి..
మౌనానికి మల్లెల మాటలు నేర్పి..
హేమంత శృంగార వాసంతికలా..
ఆఘమేఘమై వస్తున్నా..
గంధమంటి భావాలను నీ ముందుంచాలని..!!


Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *