Wednesday, 13 July 2022
// వేదన //
మాటలన్నీ మౌనంలోకి మారిపోయిన క్షణం
అసంకల్పిత అంతర్వేదన
నిన్నుగా ఉండనివ్వని పరివేదనై
మెలిపెడుతుంది
తదేకమైన వ్యసనం వెనుక రహస్యం
ఆశనిరాశల రాశుల్లో ఊగిసలాడి
అంతరాయంలేని అలజడిని పెంచేస్తుంది
యాంత్రికమైన నవ్వులకి అలవాటుపడ్డ జీవితానికి
ఆదమరుపు దిగులో తత్వమై
నిశ్శబ్దాన్ని శ్రద్ధగా అనుసరించమంటుంది
అదేమో...
అసలు దరిచేరని వెలుగుని ఊహించడమూ
ఓ కళ కావొచ్చు..
My happiness is trapped inside a pain
that never ceased
// Morning Ragas //
అలవికాని పనుల యాతనలో
మనసు మడతలు విప్పి
నన్ను పలకరించేంత ఆర్తి
ఏ తలపుకీ ఉండదు ఒక్కోసారి
నేనలా ఖాళీగా కూర్చోగానే
చెట్టుకీ పిట్టకీ ఆనందం అలలేసి
నా రంగురంగుల మట్టిగాజులు లెక్కెడతాయా..
ముఖాన్ని ఎరుపు చేసే చిరునవ్వుకి తోడు
మౌనంగా నాసికను చేరి
గుండెనింపే కాఫీ పరిమళమొక్కటీ
అంతర్ముఖానికీ ఉత్సాహాన్నిస్తుంది
తమని వినడానికే వచ్చానని
పువ్వుల కేరింతలు చూడాలప్పుడు..
కాసేపు నన్ను ఆదమరచిపొమ్మని చెప్పకనే చెప్పేస్తాయి
Tuesday, 12 July 2022
// మనసు తడి //
పూజించో సేవించో
కాలాన్ని ఎంత వేడుకున్నానని
తను పరిగెత్తుతూ నన్నూ కదలమంటుంటే
చతికిలపడ్డ హృదయాన్ని కాస్తయినా ఓదార్చమని
ఋతువులు మారడం సహజమే అయినా
ఏమో...
ఒక్కో ఆకూ రాలిపోతూ
కొమ్మల్ని దిగులుకొదిలేస్తున్నప్పటి బాధ ఇదేనేమో
దేహానికి పగుళ్ళు తప్పించలేని రోజుల్లో
మనసు తడి కన్నులకు తప్ప
దాహాన్ని తీర్చేందుకు పనికి రాదేమో 😔
Seems like the good time s over
N m anemic all d time..
// గాయాల సలుపు //
సత్యమనే బరువు మోస్తున్న నీలో
ఓ తిరుగుబాటు ఉండే ఉంటుంది
మనసు దాచుకున్నన్నాళ్ళూ
నువ్వు ప్రసరించే చూపుల్లో
అదో రహస్యంగా నిద్రిస్తున్నట్టే అనిపిస్తుంది
నిన్ను నువ్వు విదిలించుకుంటూ
ఉక్రోషమైనంతసేపూ
అస్థిమితదారుల్లో కలదిరుగుతూనే ఉంటావేమో...
గుండెల్లో ఘోషిస్తున్న శబ్దాలు
నిశ్శబ్ద లోయల్లోకి జారి
అంతర్వేచన ముగిసినప్పుడే
సూక్ష్మ గాయాల సలుపు నెమ్మదిస్తుంది
చెప్పాలనుకున్నదేదీ పెదవి దాటలేకపోయాక
రెప్పలగోడలమాటే నీ దాగుడుమూతలాట సాగాలిక
// మల్లె మొగ్గలు //
మౌనంగా చిగురించే కాలానికి
ఆత్మానందపు క్షణాలంటే
మనలోంచీ మనల్ని తీసుకుపోయేవేమో..
ఏమో..
వేసవికన్నా ముందే మురిపించే
ఈ మొగ్గల ముగ్ధత్వం
బిడియాల పచ్చిదేహపు సమ్మోహనం
నీరెండలో నిర్మలంగా నవ్వే నక్షత్రాల్లా
ఈ అద్భుతమైన గుబుర్ల చెంతనుంటే
మనసంతా పరవశాల కాంతి వలయం
అవునవే.. మోహాన్ని మోస్తూ తన్మయత్వంగా
కొమ్మకు ఊగుతున్న మల్లెపువ్వులు..
పరిమళాలతో అలికిడి చేస్తున్నాయంటే
విచ్చుకుని ఎంతసేపయ్యిందో
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
మనోహరమైన మధురస్వరాల
అమృతవెల్లువ స్వరూపము మన తెలుగు
హృదయానంద మధన సౌందర్యజనిత
సుమ పరిమళం కదా తెలుగు
సర్వకాల కల్లోల సమయాల్లోనూ
మృదువైన మట్టివాసనమయము తెలుగు
వేకువకిరణ ఆశీర్వచనాలాపనల
కోమల శాంతికపోతము మన తెలుగు
మానస సరోవర కెరటాల ఆహ్లాదమౌ
ప్రాణతరంగపు లీల కదా తెలుగు
అంతులేని పరిపూర్ణ భావనాస్రవంతిగా
ఆచంద్రార్కము వర్ధిల్లు మన తెలుగు
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Baby Shark DooDoo DooDoo Doo.. మళ్ళీ బాల్యంలోనికి పరుగెత్తాలనుంది ఇంద్రజాలమై కదిలే కాలాన్ని వెనక్కి తిప్పాలనుంది చాక్లెట్లు పూసే చెట...
-
అందరిలాగే ఆమెకూ ఆశలెక్కువ అందరికన్నా కూడా ఆమెకు అందమెక్కువ అందాన్ని ఆదరించే లోకముందని తెలిసినప్పుడే మొదలైన భ్రమలు కట్టు బట్టలతో గడప దాట...
-
ఈ వేసవి సాయంత్రాన..ఏదో సుతిమెత్తని రాగం.. మదిలో మొదలైన నిశ్శబ్దం కరిగి కోలాహలమేదో మొదలైనట్టు.. పచ్చదనం మాదిరి పదేపదే పెనవేసుకొనే చిరు...
-
ఇక్కడిక్కడ లోకమనే కచేరీలో పాడుతున్నట్టే కనిపిస్తా ఓ నిమీలిత అనుభూతినై ఏకాంతంలో నేనున్నా మోహంలో మునిగినట్టుండే ఆత్మస్పృహ నేనో అంతర్లోకం...