నదులు వెనక్కి కొండల్లోకి తిరిగినట్టు
నరాల్లో సత్తువ ఆక్రోశించలేక వేళ్ళాడుతుంది
రోజులన్నీ చీకటివే అయితే అగాధలోతుల్లోకి
జారినట్టు కన్ను ఏడుస్తుంది
ఒంటరితనానికి దిక్కులే దిక్కన్నట్టు
మనసు ప్రతిధ్వనించి సమాధాన పరిచాక
జీవితాన్ని మించినదేదీ ముఖ్యమైంది కాదని
నిట్టూర్పులే ఈలలుగా మారుతాయి
గాలిలో దీపమనుక్కున్న ఆరోగ్యం ఇప్పుడో అవసరం
గమ్యమో ప్రశ్నార్ధకమైనా సత్యాన్ని మోయాలనుకున్నాక
రెపరెపలాడుతున్న ఊపిరికి కొంత ఆయువు దొరికి
ఆశలకు భవిష్యత్తనే ప్రాణం పోస్తుంది
పాత నమ్మకాలు వదిలి కొత్త సిద్ధాంతాలు కూర్చుకున్నా
ఎక్కాలనుకున్న శిఖరం ఎంత ఎత్తునున్నా
విషాదానికి సెలవుచీటీ రాసిచ్చేసాక
జీవితానికి ఎదురు తిరగాలనిపిస్తుంది
ఇదిగో..ఇప్పుడు మొదలవుతుంది నా పాట
"మనసా..గెలుపు నీదేరా
మనిషై..వెలిగిపోవేరా" అని
