Tuesday, 19 October 2021

విషాద సముద్రం

ఒక్కోసారి విషాదం సముద్రంలా అలలు విరుగుతుంది నిన్నంతా తడిపి నిస్పృహలో నిలబెడుతుంది ఊపిరాడక గింజుకునేలా, ఓడిపోయిన అనాథలా పచ్చిగాయాన్ని రేపుతుంది నీకు నువ్వే ఘనీభవించిన రాయిగా మారాక నీ కలల్ని దోచుకుని ఆడుకుంటుంది గుప్పిట్లో దాచుకున్న సందిగ్ధాలు నిశ్శబ్దాన్ని శబ్దం చేస్తూ చిగురించే సమయం ఎప్పుడో దాటిపోయిందని అన్యాపదేశ ప్రకటన వినిపిస్తుంది ఇదేదో అర్ధంకాని రోదనలా ఎదుటివారికి కనిపించినా నిన్ను మాత్రం గుక్కపెట్టేలా ఏడిపిస్తుంది లోకం మొత్తం ఏకమై శపించినట్లు రొదపెట్టే అనుభవాలు తడుముకుంటూ బ్రతుకంతా బాధని మోయమని తీర్మానిస్తుంది

గతం గతః..

ఆమె: హేయ్..ఎందుకలా ఎప్పుడూ విషాదంలో ఉన్నట్టుంటావ్ అతను: కొన్ని స్వరాలకు సరిహద్దులుండనట్టు నిశ్శబ్దం రాగమైన రాత్రిపూట ఒంటరితనానికదో విషాదపు కల ఆమె: కవిత్వం బాగుంది..కానీ ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు అతను: నిలువక తరలిపొతున్నదే అయినా ప్రతిక్షణం గడిచిపోయిన కాలాన్ని ఉబికే అలల్ని తోడినట్టు జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం నాకదో వ్యసనం.. ఆమె: ఓహ్..ఇప్పుడు కొంచం కొంచం అర్ధమవుతోంది అతను: మనసుపొరల్లో దాక్కొన్న దిగులుకి మాటలు పూడుకుపోయినా మౌనం మిగిలుందని ఆత్మ పాడుకొనే మధురగీతం పడమటి కోయిల ఆక్రోశం.. ఆమె: ఆపింక..అంతకంతకూ విశాలమవుతున్న చింతనావలోకంలో కాలస్పృహ కరిగి అనిశ్చితమైన ఓ అనుభవం మాత్రం బిగుసుకుంటుంది. అతను: ?? ఆమె: గతం యొక్క అవశేషాలు నీ "ప్రస్తుతాన్ని" లోపించేలా చేస్తున్న రహస్యం నీకు తెలుసా? అతను: ....!! ఆమె: విజయాన్ని తొడుక్కోవాలని ఉందా లేదా అతను: &%$@# ఆమె: నిన్నటిని సమాథి చేయాలంటే రేపటికి ఎగరాల్సిన నీ ఆకాశాన్ని ఊహించు అతను: అదంతా జరిగే పనేనా.. ఆమె: మనోవ్యథకి మందువేసి ముందు నీ విలువ పెంచుకో ఇప్పటి నీ కన్నీళ్ళు రేపటి ఆనందభాష్పాలు కాగలవు అతను: అందుకే అన్నారేమో..చక్కని చెలిమి ఎక్కడో ఉండదు చిరునవ్వుతో పరామర్శించే హృదయంలో ఉంటుందని..

Endurance..

అప్రమత్తంగా ఉన్న నిన్ను విషాదం నిర్దయగా కమ్ముకుంటున్నా కొత్తగా ఊపిరి పోసుకునే ఆలోచనలేవీ ఉండవు కాలం కదులుతూనే ఉంటుందని తెలిసినా కలిసి నడిచే తోడు కోసం చూడదని మర్చిపోతావ్ ఎన్నో గాయాలకోర్చిన నీ నగ్నపాదాలు శిఖరానికేసి నడవడమింక కష్టమని ఆగిపోతాయ్ తీర్చలేని వాగ్దానాలన్నీ మౌనం పాటిస్తున్నట్టనిపించగానే భ్రమలు తొలగిపోతున్న దృశ్యం కంటికడ్డొస్తుంది అంతే.. గ్రహణం పట్టినట్టున్న ఈరోజు మీద అసహనం పెరుగుతున్నా భరిస్తూనే ఉండిపోతావ్ !!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *