Saturday, 2 November 2019

//అక్షర సౌరభం//

పరవశ పదాల అలికిడి
నువ్వొస్తున్నందుకేనా..

హృదయ చలనానికి లయతప్పించే
ఆ అక్షర సౌరభం
నన్ను రాయబోయే వాక్యాలదేనా

గొంతు కలిపిన నవ్వులో
గుండె కింది సంతోషం
నీతో మొదలయ్యే మాట్లాటకేనా

కలకాలం చేసే తపస్సు
ప్రతిక్షణం నీ ఆర్తి కోసమైతే
ఆ ధ్యానమో అదృష్టమేగా 💜💕

//వర్తమానం//

చీకటి ఆవరించిన నిర్వికారంలో
పరిమళం కోల్పోతున్న పువ్వులా
సమూహం మధ్యలోనూ అదే ఒంటరితనం

ప్రయాణపు గమ్యం
శూన్యమైనప్పటి నిశ్శబ్దం
ఒక అచేతనమైన విషాదపు శకలం

అవిశ్రాంత పోరాటంలో అలసిపోయినా
స్వాభిమానపు నిబ్బరం కోల్పోని
క్షణాలన్నీ ఉత్పాదకాలై
జీవితంతో రాజీపడలేని చలనమే
ఓ తపస్సు విజయవంతమైన వర్తమానం


//మనసు నిచ్చెన//

మనసు నిచ్చెనమెట్ల మీద
నీ తలపు మెత్తన

గుండెగది గుప్తద్వారానికి
మౌనరాగం మూర్ఛనైతే
మనోల్లాసం అల్లనల్లన

పల్లవించిన రంగులు
పంచవన్నెల చిలుకలైనట్టు ఎంత అందమో

ఆపై ఎవరు పాడిన పాటైతేనేమి
పదాలు ఇద్దరూ కలిసి అల్లుకున్నాక
అసలు
నువ్వెక్కడుంటేనేమి..
నీ చుట్టూ తోట నేనయ్యాక..
చీకటైతేనేమి..
చిరుగాలి నేనై పరిమళించాక..💕💜

//అలిగిన మౌనం//

అలిగిన మౌనంలోని కదలికలే
తరంగాలుగా తడుముతున్న గుసగుసలు
గుట్టుగా గుబులెత్తించే ఇన్ని కలలు
మూసినరెప్పల మాటు అల్లరి అలలు

నువ్వద్దిన చుంబనమే
నుదుటన కస్తూరి భావమై
వెన్నెల తిన్నెలపై వజ్రపు పుప్పొడిలా
నీ విరహమంటిన ఎర్రని తలపులు

మదిలో పూసిన పువ్వులకేమో
పులకరిస్తున్న క్షణాల శ్రీగంధాలు
అరచేతులు పెనవేసుకున్న అల్లికలై
మనసూగుతున్న పదనిసలు

నిశ్శబ్దం సమసిపోతేనే
గుండెచప్పుడు వినాలనిపించేది
పదాలు కలిసుంటేనే
మదిభావమై నిన్ను చేరగలిగేది..😊💜

//శరద్వెన్నెల//

ఏకాంతపు పొదరింట్లో
ప్రపంచాన్ని మరిపించేంత పరవశం ప్రవహించాలంటే
రెప్ప వాల్చని నక్షత్రాలుగా కదిలే ప్రేమభావం
వెచ్చని పలకరింపుగా తడమాలనిపించింది

సముద్రం సంగీతాన్ని ఆలపిస్తున్న రహస్యం
అందమైన నా ఊహాలోకమైతే
ఇన్ని లక్షల పువ్వులెవరు నింపారో
నా అంతరంగమిలా మత్తెక్కించు విస్మయమయ్యింది

ఆచ్ఛాదన తొలిగిన సహజత్వం
సౌందర్యానికి చిరునామా కనుక
ఎదలో స్పందన పెదవులపై ఎగిసి
నిశ్శబ్దాన్ని మధురం చేసింది

నిర్వచించలేని ఆ పుచ్చపండు శరద్వెన్నెల
ఉద్వేగమై పొంగిపొరలిన మధువుగా మారి
చప్పుడు చేయకనే ఎదను తడిపి
అనుభూతి మెండుగా మహత్తు కురిపించింది..💕💜

//మనస్సొద//

విషాదాన్ని నింపుకున్న మది
ఆనందం తనే వచ్చి చెంత నిలబడ్డా
ఓపుకోలేని గాయాన్ని మోస్తూ ఎటో చూస్తుంటుంది

చినుకే కదాని ఆల్చిప్పలు నిదరోతే
సముద్రగర్భం ముత్యాలెలా పొదుగుతుందని

అపురూపాలన్నీ నిరాశకు నెట్టి
అరచేతిలో అదృష్టాన్ని వెతుక్కొనే
ఏకాకితనం..అదో దౌర్భాగ్యం కావచ్చు

మౌనం శబ్దాల్ని ఆపిందని
లోలోపల కురుక్షేత్రాన్ని సృష్టించుకున్న
మనస్సొదను ఆపగలిగేదెవ్వరని

కన్నీటిని తాగేందుకు తపించే కన్నులకు
కలల తీపి తెలిసినా రుచించేదెప్పుడని

హృదయానికెన్ని రంగులు అద్దనీ..
శోకాన్ని స్రవించే నీలపురంగే ఇష్టమయ్యాక
హరివిల్లు అందం కేవలం ప్రకృతి ప్రకోపం మాత్రమే కదూ..😣

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *