Monday, 8 July 2024

హేమంతంలో వసంతం... 😌

హేమంతపు తెమ్మెర చలిగా అరుస్తూ నీ మౌనాన్ని అనువదిస్తుందేమో.. ఆకాశపుటంచుల వెంబడి ఆ వచనం ఆహ్లాదపు ప్రేమలేఖగా నాలో నిండిన భావోద్వేగం.. ప్రదోష ప్రాణాయామంలో పీల్చుకున్న శ్వాస నీ జ్ఞాపకమే అయినట్టు ఎద తోటకి ఇప్పుడు వసంతఋతువేమో.. వెన్నెల్లో గోవర్ధనం గుండెల్లోకొచ్చి గోరువెచ్చనైన కలలు పొదిగినట్టు ఈ వేకువ వాత్స్యాయన సుప్రభాతం... అక్కడా ఇక్కడాని సౌందర్యాన్ని, సంతోషాన్ని నేనేం వెతకలేదులే.. నీలో కాంతివేగానికి నాలో శీతలత్వం కరిగి చిగురిస్తున్నానని చెప్తున్నా అంతే !!

// శుభాకాంక్షలు //

ఇన్నాళ్లూ ఎక్కడుందో కోయిల కొమ్మల్లో దోబోచులాడుతూ పాడుతుందీ వేళ వసంతమొచ్చిందని దానికెలా తెలిసిందో ఆకులు చిగురిస్తూ ఆమని తాదాత్మ్యం కాలస్పృహకు స్పందిస్తూ పచ్చదనం పునాదిగా ప్రకృతి మెరుస్తుంది సుతారపు మల్లె సువాసన మొదలై చల్లని నీ జ్ఞాపకాల చినుకులుగా నన్ను ఆసాంతం ముంచెత్తుతుంది నిలువెత్తు భావాల నా ప్రేమ కవిత ఉద్విగ్న పెదవుల్లో పలకాలని ఊహల మైదానాన్ని దాటి నిన్ను చేరుతుంది కావాలంటే నువ్వూ విను.. ఊపిరాడనంతగా వెచ్చదనం కమ్ముకుందంటే ఈ వేసవి వాక్యాల తీయని వెత నాదేనని ఒప్పుకుంటావు ఎప్పటిలాగే సర్వ శుభాలు కలగాలని ఆశిస్తూ.. ఉగాది పండుగ శుభాకాంక్షలు

// ఉగాది //

ఆదమరపులో ఉందొద్దని కాలం చిన్న చిన్న సంతోషాల్ని నింపెందుకే ఋతువులు మార్చుకుంటూ వెళ్తుంది కదూ ఇన్నాళ్లూ ఎక్కడుందో కోయిల కొమ్మల్లో దోబోచులాడుతూ పాడుతుందీ వేళ వసంతమొచ్చిందని దానికెలా తెలిసిందో ఆకులు చిగురిస్తూ ఆమని తాదాత్మ్యం కాలస్పృహకు స్పందిస్తూ పచ్చదనం పునాదిగా ప్రకృతి మెరుస్తుంది అవును.. తీపీ వగరు ఆశల పరిమళాలతో ఎదురుచూస్తున్న ఉగాది వచ్చేసింది.

Sunday, 7 July 2024

// వాక్యాలు //

నీ పెదాలు దాయలేని మాటలన్నీ అక్షరాలుగా మార్చి నిశ్శబ్దంలో మేలుకుంటావ్ చూడు.. నాకేమనిపిస్తుందంటే... వసంతాన్ని కామించి రాజేసుకున్న వాక్యాలు నీ గుండె లోపల దీపాలై వెలుగుతుంటాయని.. ఆ కళ్ళలో సుళ్ళుగా తిరిగే నా జ్ఞాపకాలను నిశ్చింతగా వెచ్చబెట్టుకుని కొత్త కవిత రాస్తుంటావని !!

// అమ్మెందుకో //

కొందరు అమ్మలెందుకో అకస్మాత్తుగా వెళ్లిపోతారు కొంచం దయని నేర్పినట్టే నేర్పి పూర్తిగా అర్థం కాకుండానే మరలిపోతారు చిన్నప్పుడు మన నవ్వులకి ప్రాణం పెట్టి పెద్దయ్యాక వాటిని తీసుకుపోతారు మనమేమో.. వెనక్కి చూడరని తెలిసినా వాళ్ళ ఇష్టాల్ని మనలో పోల్చుకుంటూ మురిసిపోతాం లోకానికి పట్టని ఎన్నెన్నో జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని లోలోపలే దిగులుపడతాం మనకోసం తడిబారిన తన కళ్ళు వీపుకి గుచ్చుకున్నట్టు అనిపించగానే అమ్మకి మనమెంత ఇష్టమో అని కలుక్కుమంటాం

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *